CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 20 August 2026, 10:34 pm Posted by : CHAITHANYA GALAM NEWS

గాంధీ కుటుంబంపై బురదజల్లే కుట్ర

  • బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 20 (చైతన్యగళం): స్వాతంత్రోద్యమంతో ప్రత్యక్ష సంబంధం లేని బీజేపీ.. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోందని సుడా మాజీ చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గేపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.

కరీంనగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నరేందర్‌రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ, ఆ పార్టీ నాయకులను విమర్శించే నైతిక హక్కు బీజేపీకి లేదన్నారు. వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ స్థాయిలో ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు. జనసంఘ్‌ 1951లో ఏర్పడిందని, అనంతరం 1980లో భారతీయ జనతా పార్టీగా అవతరించిందని పేర్కొన్నారు.

దేశం కోసం త్యాగాలు చేసిన గాంధీ కుటుంబంపై విమర్శలు చేయడం బీజేపీ నేతలకు తగదన్నారు. ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం రెండుసార్లు వచ్చినప్పటికీ సోనియాగాంధీ దానిని సున్నితంగా తిరస్కరించారని, ఆమె త్యాగం, నిబద్ధతను దేశ ప్రజలు గుర్తిస్తారని అన్నారు. మల్లికార్జున ఖర్గే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నిబద్ధతగల ప్రజా నాయకుడని పేర్కొన్నారు.

విద్యార్థుల సమస్యలపై బీజేపీకి మాట్లాడే హక్కు లేదు

విద్యార్థుల సమస్యలపై బీజేపీ నేతలు మాట్లాడే నైతిక హక్కు లేదని నరేందర్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన విద్యార్థులపై దమనకాండకు పాల్పడిన వారే ఇప్పుడు విద్యార్థుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో బీజేపీ నేతలు గతంలో ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పదేళ్లపాటు బీజేపీతో కొనసాగిన రాజకీయ సంబంధాల కారణంగానే రాష్ట్రం అప్పుల భారంలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం ఉందన్న అంశంపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

మోదీ ఉద్యోగాల హామీ ఏమైంది?

ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ ఏమైందని నరేందర్‌రెడ్డి ప్రశ్నించారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాల కల్పనలో విఫలమైందని విమర్శించారు.

రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పటికే సుమారు 70 వేల ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సాధించిందన్నారు. ప్రజా సంక్షేమం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనలో కాంగ్రెస్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని పేర్కొన్నారు.

బీజేపీ నేతలు వాస్తవాలను వక్రీకరించి కాంగ్రెస్‌ పార్టీపై విమర్శలు చేయడం మానుకోవాలని, ప్రజా సమస్యలపై నిర్మాణాత్మకంగా మాట్లాడాలని నరేందర్‌రెడ్డి హితవు పలికారు.

ఈ సమావేశంలో పర్వతం మల్లేశం, గుండాటి శ్రీనివాస్‌రెడ్డి, కుర్ర పోచయ్య, జీడి రమేష్‌, ముక్క భాస్కర్‌, లయక్‌ మూల కృష్ణారెడ్డి, పెద్దిగారి తిరుపతి, మేకల నర్సయ్య, మామిడి సత్యనారాయణరెడ్డి, తోట అంజయ్య, గుడిపాటి రమణారెడ్డి, షెహెన్ష ఖలీల్‌, బత్తుల రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.