CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 19 August 2026, 4:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వైభవంగా నూతన వైశ్య భవన్‌ ఏసీ కన్వెన్షన్‌కు భూమిపూజ

  • వైశ్యుల ఐక్యత, సేవా స్ఫూర్తి అభినందనీయం: బండి సంజయ్‌
  • భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా నిర్మాణం: గంగుల కమలాకర్‌

కరీంనగర్‌, ఆగస్టు 19 (చైతన్యగళం): కరీంనగర్‌ నగరంలో నూతనంగా నిర్మించనున్న వైశ్య భవన్‌ ఏసీ కన్వెన్షన్‌కు బుధవారం వైభవంగా భూమిపూజ నిర్వహించారు. వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు చిదుర సురేష్‌ అధ్యక్షతన పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం మంగళంపల్లి శ్రీనివాస శర్మ వేదమంత్రోచ్చరణల నడుమ ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భూమిపూజ మహోత్సవానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ముఖ్య అతిథులుగా హాజరై నిర్మాణానికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించారు.

సేవా కార్యక్రమాల్లో వైశ్యులు ముందంజ

ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సామాజిక సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో వైశ్యులు ఎప్పుడూ ముందుంటారని కొనియాడారు. వైశ్యులంతా ఐకమత్యంతో ముందుకు వచ్చి నూతన వైశ్య భవన్‌ నిర్మాణానికి దాతలుగా సహాయ సహకారాలు అందించడం అభినందనీయమన్నారు. భవన్‌ నిర్మాణానికి తనవంతు సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు చిదుర సురేష్‌, పాలకవర్గ సభ్యులను అభినందించారు.

వేలాది వివాహాలకు వేదిక

ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. కరీంనగర్‌లోని వైశ్య భవన్‌ ఎన్నో ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలకు, వేలాది వివాహ వేడుకలకు వేదికగా నిలిచిందన్నారు. కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్‌ తరాలకు ఉపయోగపడేలా నూతన భవన్‌ నిర్మాణానికి సంకల్పించడం అభినందనీయమన్నారు. నిర్మాణానికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని తెలిపారు.

దాతలకు కృతజ్ఞతలు

వైశ్య సేవా కేంద్రం అధ్యక్షుడు చిదుర సురేష్‌ మాట్లాడుతూ.. నూతన వైశ్య భవన్‌ ఏసీ కన్వెన్షన్‌ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తున్న వైశ్య సోదరులు, దాతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సహకారంతో నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేసి సమాజానికి మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు.

ప్రముఖుల హాజరు

కార్యక్రమంలో కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, సుడా ఛైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొని నూతన భవన్‌ నిర్మాణానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని తెలిపారు. కార్పొరేటర్లు వంగల పవన్‌, బోనగిరి వేణుగోపాల్‌, కక్కిరాల రమేష్‌, కోడిత్యాల మల్లేశం, పెద్ది లక్ష్మీనారాయణ, గంజి స్వరాజ్యబాబు, నలుమాసు సుదర్శనం, కమటాల రామ్మోహన్‌ పాల్గొన్నారు.

వైశ్య సేవా కేంద్రం ప్రధాన కార్యదర్శి పెద్ది విద్యాసాగర్‌, కోశాధికారి ముత్యాల రమేష్‌, వైశ్య భవన్‌ ఏసీ కన్వెన్షన్‌ నిర్మాణ కోఆర్డినేటర్‌ పల్లెర్ల శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడు ఎలగందుల మునీందర్‌, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ రామిడి శ్రీధర్‌, డైరెక్టర్లు సిరిపురం సురేందర్‌, నార్ల శ్రీనివాస్‌, నలుమాచు చంద్రశేఖర్‌, కైలాస నవీన్‌, కొండ రాంబాబు, గౌరీశెట్టి సుమన్‌, పోకల లక్ష్మీనారాయణ, మాడూరి మల్లేశం తదితరులు హాజరయ్యారు.

వివిధ ఆర్యవైశ్య అభ్యుదయ సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు, దాతలు, వైశ్య సోదరులు పెద్ద సంఖ్యలో పాల్గొని భూమిపూజ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.