CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 3:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరట

  • 48 గంటల్లో ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆదేశం.. వైద్య బోర్డు ఏర్పాటు

జైలు శిక్ష అనుభవిస్తున్న పాకిస్థాన్‌ మాజీ ప్రధాని, పాకిస్థాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ) అధినేత ఇమ్రాన్‌ ఖాన్‌కు సుప్రీంకోర్టు భారీ ఊరటనిచ్చింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను 48 గంటల్లోపు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన వైద్యం అందించాలని తాజాగా ఆదేశించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు ప్రత్యేక మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది.

ఈ బోర్డులో ఇమ్రాన్‌ ఖాన్‌ వ్యక్తిగత వైద్యుడితో పాటు ఆయన సోదరి డా. ఉజ్మా ఖాన్‌ను సభ్యులుగా చేర్చాలని కోర్టు పేర్కొంది. అదే సమయంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన వైద్య రికార్డులను బహిరంగపరచి రాజకీయ వివాదాలకు దారితీయవద్దని ఇమ్రాన్‌ తరఫు న్యాయవాదులను సుప్రీంకోర్టు హెచ్చరించింది.

ఇమ్రాన్‌ ఖాన్‌ను వారానికి ఒకసారి కుటుంబ సభ్యులు కలిసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడే వరకు ఆసుపత్రిలోనే ఉంచాలని పీటీఐ నేతలు, ఆయన మద్దతుదారులు కోరుతున్నారు.

2023 నుంచి జైలులోనే..

అవినీతి సహా పలు కేసుల్లో దోషిగా తేలిన ఇమ్రాన్‌ ఖాన్‌ 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అడియాలా జైలులో ఉన్నారు. అయితే తనపై నమోదైన కేసులన్నీ రాజకీయ కక్షతో పెట్టినవేనని, తాను నిర్దోషినని ఇమ్రాన్‌ ఖాన్‌ మొదటి నుంచీ వాదిస్తున్నారు.

మరోవైపు, ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని గత కొంతకాలంగా కుమారులు, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆయన కుడి కంటి చూపు గణనీయంగా తగ్గిపోయిందని వారు పేర్కొన్నారు. తాజాగా వైద్య కారణాలతో సుప్రీంకోర్టు జోక్యంతో ఊరట లభించడంపై పీటీఐ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం మరింత ముందుగానే వచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.

2018లో ప్రధాని.. 2022లో పదవీచ్యుతి

2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించిన ఇమ్రాన్‌ ఖాన్‌ పాకిస్థాన్‌ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే 2022లో జరిగిన బలనిరూపణలో ఓటమిపాలై ప్రధాని పదవి నుంచి తప్పుకున్నారు. అనంతరం ఆయనపై అవినీతి, చట్టవిరుద్ధ వివాహం తదితర ఆరోపణలతో పలు కేసులు నమోదయ్యాయి.

కొన్ని కేసుల్లో ఆయన దోషిగా తేలగా, మరికొన్ని కేసులను కోర్టులు కొట్టివేశాయి. ఇంకొన్ని కేసుల్లో దాఖలైన అప్పీళ్లపై విచారణ కొనసాగుతోంది.

పీటీఐకి కొనసాగుతున్న ప్రజాదరణ

పీటీఐ తన ఎన్నికల గుర్తును కోల్పోవడంతో 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి విజయం సాధించారు. అయినప్పటికీ పాకిస్థాన్‌లో పీటీఐకు ప్రజల్లో గణనీయమైన మద్దతు కొనసాగుతోందని అక్కడి మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.