- జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, న్యాయవాదుల సంతాపం
కరీంనగర్, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది పర్లేర్ల గోపాల కిషన్ (87) సోమవారం రాత్రి మృతి చెందారు. ఆయన మృతికి సంతాపంగా కరీంనగర్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కోర్టు హాల్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులతో సంతాప సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌తో పాటు పలువురు సీనియర్ న్యాయవాదులు గోపాల కిషన్‌తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. న్యాయవాదిగా ఆయన అందించిన సేవలను కొనియాడుతూ, వృత్తిపట్ల ఆయనకున్న నిబద్ధతను స్మరించుకున్నారు.
జిల్లా జడ్జి ఎస్. శివకుమార్ మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది గోపాల కిషన్ మృతి బాధాకరమన్నారు. ఆయనను పలువురు న్యాయవాదులు అభిమానించి, ఆదర్శంగా తీసుకోవడం ఆయన సేవలకు నిదర్శనమని తెలిపారు. న్యాయమూర్తుల తరఫున గోపాల కిషన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
అనంతరం గోపాల కిషన్ మృతికి సంతాపంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయనకు నివాళిగా న్యాయవాదులు విధులకు హాజరుకాలేదు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.