CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:39 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సమానత్వం కోసం సర్వాయి పాపన్న గౌడ్‌ కృషి చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది

  • సరికొండలో ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి

కడ్తాల్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): సబ్బండ వర్గాలకు రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని సరికొండ సర్పంచ్‌ పాలకూర్ల మహేందర్‌ గౌడ్‌ అన్నారు. తెలంగాణ బహుజనుల ఆత్మగౌరవానికి, ధీరత్వానికి ప్రతీకగా నిలిచిన సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి సందర్భంగా మంగళవారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు.

కడ్తాల్‌ మండలం సరికొండ గ్రామపంచాయతీ ఆవరణలో ఉన్న సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహం వద్ద సరికొండ గౌడ, గీత కార్మిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌడ సంఘం ఆధ్వర్యంలో కేక్‌ కట్‌ చేసి పాపన్న గౌడ్‌ సేవలను స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా సర్పంచ్‌ పాలకూర్ల మహేందర్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచిన సర్వాయి పాపన్న గౌడ్‌ భూస్వామ్య వ్యవస్థ, దోపిడీ, అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. అట్టడుగు వర్గాలకు న్యాయం జరిగేలా ఆయన సాగించిన పోరాటం భవిష్యత్‌ తరాలకు స్ఫూర్తిదాయకమన్నారు.

కుల, మతాలకు అతీతంగా పేదలకు అండగా నిలవాలని, అవినీతి, దోపిడీ, అక్రమాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాడాలని పిలుపునిచ్చారు. జయంతి, వర్ధంతి సందర్భాల్లో మాత్రమే పాపన్న గౌడ్‌ను స్మరించకుండా, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు నిరంతరం కృషి చేయాలని సూచించారు.

కార్యక్రమంలో సరికొండ గౌడ సంఘం అధ్యక్షుడు రాములు, ఉపాధ్యక్షుడు యాదయ్య, మాజీ ప్రజాప్రతినిధులు నర్సింహ, లక్ష్మయ్య, వెంకటయ్య, వివిధ పార్టీల నాయకులు, గౌడ సంఘం నాయకులు, యువకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.