CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 4:43 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ జయంతి వేడుకలు

  • పాపన్న గౌడ్‌ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకం

మర్రిగూడ, ఆగస్టు 18 (చైతన్యగళం): సామాజిక సమానత్వం, స్వాభిమానం, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన చక్రవర్తి సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ మహారాజ్‌ 376వ జయంతి వేడుకలను మర్రిగూడ మండల కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బహుజన సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో నాయకులు జెండాను ఆవిష్కరించి, సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి, బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం సర్వాయి పాపన్న గౌడ్‌ చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. ఆయన ధైర్యసాహసాలు, సమానత్వ భావన, స్వాభిమానం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. పాపన్న గౌడ్‌ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

జయంతి, వర్ధంతి వేడుకలకే పరిమితం కాకుండా పాపన్న గౌడ్‌ ఆశయాలను నిత్య జీవితంలో ఆచరించాలని నాయకులు సూచించారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం నెలకొనేలా యువత ముందుకు రావాలని కోరారు.

కార్యక్రమంలో వీరమల్ల లోకేష్‌ గౌడ్‌, కట్కూరి వెంకటేష్‌ గౌడ్‌, పందుల యాదయ్య, గౌడ సంఘం నాయకులు చెరకు శ్రీరాములు గౌడ్‌, నల్ల యాదయ్య గౌడ్‌, పందుల రాములు గౌడ్‌, రామదాసు శ్రీనివాస్‌, పాపన్న సంఘం అధ్యక్షుడు జమ్ముల వెంకటేష్‌ గౌడ్‌, శ్రీరాములు గౌడ్‌, బాడిగా అంజయ్య, రావుల రాములు, మదగోని మహేష్‌, రాజేందర్‌ నాయక్‌, నాగిళ్ల మారయ్య, బహుజన నాయకులు పగడాల లింగయ్య, పిట్టల శీను తదితరులు పాల్గొన్నారు.

మర్రిగూడ మండలంలోని వివిధ గ్రామాల గౌడ సంఘం నాయకులు, బహుజన సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని సర్వాయి పాపన్న గౌడ్‌ చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలు నేటి తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.