CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 8:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వందేమాతరం గేయాన్ని కాంగ్రెస్‌ అవమానించడం సిగ్గుచేటు

  • కాంగ్రెస్‌ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌

కరీంనగర్‌ , ఆగస్టు 18 (చైతన్యగళం): జాతీయ గేయం వందేమాతరాన్ని కాంగ్రెస్‌ అగ్రనేతలు సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే అవమానించడం దేశానికే సిగ్గుచేటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. భారతీయులందరూ తలదించుకునేలా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని విమర్శించారు.

కరీంనగర్‌ టవర్‌ సర్కిల్‌ వద్ద మేయర్‌ కొలగాని శ్రీనివాస్‌, డిప్యూటీ మేయర్‌ సునీల్‌రావు, స్థానిక బీజేపీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తిని రగిలించిన వందేమాతరం గీతంపై కాంగ్రెస్‌ సెన్సార్‌ విధించడమేంటని ప్రశ్నించారు.

దేశ విలువలు, సంస్కృతి, వేల ఏళ్ల చరిత్రపై కాంగ్రెస్‌ నాయకత్వానికి అవగాహన ఉండాలని బండి సంజయ్‌ అన్నారు. ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ కాస్తా ఇటలీ నేషనల్‌ కాంగ్రెస్‌లా మారిందని విమర్శించారు. నాడు బ్రిటిష్‌ పాలకులు సైతం వందేమాతరం గీతాన్ని విని భయపడితే, నేడు కాంగ్రెస్‌ నాయకులు వందేమాతరం పూర్తి గీతాన్ని చూసి వణుకుతున్నారని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌, ఎంఐఎం పార్టీలను దేశం నుంచి తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. వందేమాతరం గేయాన్ని అవమానించినందుకు కాంగ్రెస్‌ నాయకత్వం దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని కోరారు.

ఎంఐఎం పార్టీకి దేశభక్తి లేదని బండి సంజయ్‌ విమర్శించారు. పాకిస్థాన్‌ గెలిస్తే కరీంనగర్‌లో సంబరాలు చేసుకున్నారనే ఆరోపణలు చేస్తూ, ఆ పార్టీ తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.