- నాణ్యత లేని వంట నూనెతో తయారు చేసిన తినుబండారాలు తొలగింపు
కరీంనగర్, ఆగస్టు 18 (చైతన్యగళం): కరీంనగర్ సీపీ గౌస్ ఆలమ్ ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు మంగళవారం టవర్ సర్కిల్‌లోని ఫుడ్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో భాగంగా రాజా టీ స్టాల్‌లో వినియోగిస్తున్న వంట నూనెను పరిశీలించగా.. అది నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. నాణ్యత లేని నూనెతో తయారు చేసిన తినుబండారాలను అధికారులు తొలగించి, తదుపరి చర్యల కోసం ఉన్నతాధికారులకు నివేదించారు.
ఈ సందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ వి. సతీష్ మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత వ్యాపారులపై ఉందన్నారు.
తనిఖీల్లో టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐలు సురేందర్, శ్రీకాంత్, ఫుడ్ సేఫ్టీ అధికారులు అంకిత్ రెడ్డి, రోహిత్ రెడ్డి పాల్గొన్నారు.