CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 7:59 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రతి బూత్‌లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి: గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి

కరీంనగర్‌, ఆగస్టు 18 (చైతన్యగళం): కాంగ్రెస్‌ పార్టీకి బూత్‌ స్థాయిలో పటిష్ఠమైన పునాది నిర్మిస్తేనే పార్టీ విజయాలను మరింత సుస్థిరం చేసుకోగలదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బూత్‌ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన 26 మంది బీఎల్‌ఏ-2లు, సూపర్‌వైజర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ సంస్థాగత బలోపేతం, బూత్‌ స్థాయిలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ఓటర్లతో నిరంతర సంబంధాలు, ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఓట్ల రక్షణ తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రతి బీఎల్‌ఏ-2, సూపర్‌వైజర్‌ తమకు కేటాయించిన బూత్‌ పరిధిలోని ఓటర్లతో నిరంతరం సంబంధాలు కొనసాగించాలని సూచించారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. బూత్‌ స్థాయిలో పార్టీ కార్యకలాపాలను నిరంతరం నిర్వహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏ-2లు, సూపర్‌వైజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అర్హులైన ఓటర్ల పేర్లు ఓటరు జాబితాలో ఉండేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి బూత్‌లో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని గడ్డం చంద్రశేఖర్‌ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు కలుగుతున్న ప్రయోజనాలను వివరించి, పార్టీ కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.

సమావేశానికి అధ్యక్షత వహించిన వైద్యుల అంజన్‌ కుమార్‌ మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ కార్యకర్తలను సమన్వయం చేస్తూ కాంగ్రెస్‌ సంస్థాగత నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు.

సమావేశంలో మున్సిపల్‌ కార్పొరేటర్లు గంట శ్రీనివాస్‌, జగన్‌రెడ్డి, పార్వతుల మల్లేశం, విక్రమ్‌ సికందర్‌, ఆకుల ఉదయ్‌, ఈఆర్‌ఓ మోహన్‌, మహిళా కాంగ్రెస్‌ నాయకులు, బీఎల్‌ఏ-2లు, సూపర్‌వైజర్లు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.