CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 18 August 2026, 2:58 pm Posted by : CHAITHANYA GALAM NEWS

లెక్చరర్‌ భాస్కర్‌పై చర్యలు తీసుకోవాలి

  • సస్పెండ్‌ చేసి.. ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలి – విద్యార్థి సంఘాల డిమాండ్‌

దేవరకొండ, ఆగస్టు 18 (చైతన్యగళం): దేవరకొండ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న భాస్కర్‌ విద్యార్థినుల పట్ల అసభ్యంగా వ్యవహరించారనే ఆరోపణలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. మంగళవారం బీఆర్‌ఎస్‌వీ, ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. విద్యార్థినుల భద్రతకు భంగం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ భాస్కర్‌ను వెంటనే సస్పెండ్‌ చేయాలని కోరారు. ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, ఆరోపణలు నిజమని తేలితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అవసరమైతే సంబంధిత పోలీసు కేసు నమోదు చేసి విద్యార్థినులకు న్యాయం చేయాలని కోరారు.

కళాశాలలో విద్యార్థినులకు సురక్షితమైన, భయరహిత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత విద్యాశాఖ అధికారులపై ఉందని నాయకులు పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే స్పందించి, విద్యార్థినుల భద్రతకు భరోసా కల్పించాలని కోరారు.

కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల రాజు, బీఆర్‌ఎస్‌వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షుడు బొడ్డుపల్లి కృష్ణ, ఏబీవీపీ నాయకుడు గోపీచంద్‌, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్‌ అధ్యక్షుడు బుడిగ వెంకటేష్‌, ముదిగొండ హరిదాస్‌ తదితరులు పాల్గొన్నారు.