- ర్యాలీని ప్రారంభించిన డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి
రంగారెడ్డి, ఆగస్టు 18 (చైతన్యగళం): హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వ్యాధిపై నెలకొన్న అపోహలను తొలగించేందుకు రంగారెడ్డి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మంగళవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. Intensified IEC Campaignలో భాగంగా నిర్వహించిన ఈ ర్యాలీని రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్‌వో డాక్టర్ స్వర్ణకుమారి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ పాపారావు, డీటీవో డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. District Integrated Strategy for HIV/AIDS (DISHA) కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ర్యాలీలో TGSACS ICTC ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెంటర్ల సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, యువత, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, NACO ప్రతినిధులు సైతం ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
అపోహలను వీడాలి.. అవగాహన పెంచుకోవాలి
హెచ్‌ఐవీ/ఎయిడ్స్ నివారణ, సురక్షిత జీవన విధానం, పరీక్షలు, చికిత్స, వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడం వంటి అంశాలపై నినాదాలు చేస్తూ ర్యాలీ కొనసాగింది. బైక్‌లపై అవగాహన పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు సందేశాన్ని చేరవేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ స్వర్ణకుమారి మాట్లాడుతూ.. హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై ప్రతి ఒక్కరూ సరైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. వ్యాధిపై ఉన్న అపోహలను తొలగించడంతో పాటు హెచ్‌ఐవీతో జీవిస్తున్న వారిని వివక్షకు గురిచేయకుండా గౌరవంతో చూడాలని, వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా సహకరించాలని కోరారు.
హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌కు సంబంధించిన సందేహాలు, సలహాల కోసం 1097 టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్‌ను వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
కార్యక్రమంలో TGSACS ICTC ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సెంటర్ల సిబ్బంది, జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బంది, NACO ప్రతినిధులు, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.