CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 17 August 2026, 8:11 pm Posted by : rakeshkashaveni12@gmail.com

బురదమయమైన రహదారిపై బీజేపీ వినూత్న నిరసన

ఎల్కతుర్తి, ఆగస్టు 17(చైతన్యగళం):

ఎల్కతుర్తి–దామెర రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఎల్కతుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం వినూత్న నిరసన చేపట్టారు. ఎల్కతుర్తి సర్కిల్ వద్ద బురదమయంగా మారిన రహదారిలో గుంతల్లో నాట్లు వేస్తూ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ చింతలపల్లి–దామెర–సోమదేవరపల్లి–ధర్మసాగర్ రహదారి నాలుగు నెలలుగా అధ్వానంగా మారినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. వర్షం పడితే రహదారి మొత్తం బురదమయంగా మారి వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. హైవే నిర్మాణ పనుల్లో తీసిన నాలా, రహదారి గుంతల కారణంగా ప్రజలు బురద నీటిలోనే ప్రయాణించాల్సి వస్తోందన్నారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం, హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో మరింత ఉధృతంగా ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల ప్రభారీ లక్కిరెడ్డి తిరుమల, ప్రధాన కార్యదర్శులు ఆనికుమార్, చిదిరాల వెంకటేష్, ఉపాధ్యక్షుడు కడారి ప్రసాద్, సామల సురేష్ రెడ్డి, వివిధ మోర్చాల నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.