CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:49 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌ చరిత్ర

  • డార్విన్‌ టెస్టులో 9 వికెట్ల ఘన విజయం.. తొలిసారి కంగారూలపై టెస్టు గెలుపు

ఆస్ట్రేలియా గడ్డపై బంగ్లాదేశ్‌ క్రికెట్‌ చరిత్ర సృష్టించింది. డార్విన్‌లో జరిగిన తొలి టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియాను 9 వికెట్ల తేడాతో ఓడించి సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు క్రికెట్‌లో బంగ్లాదేశ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. 23 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాలో టెస్టు మ్యాచ్‌ ఆడుతున్న బంగ్లా జట్టు.. తొలి మ్యాచ్‌లోనే కంగారూలకు గట్టి షాకిచ్చింది.

బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అదుర్స్‌

తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 198 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బంగ్లాదేశ్‌ బ్యాటర్లు అద్భుతంగా రాణించి తొలి ఇన్నింగ్స్‌లో 426 పరుగులు చేశారు. ఓపెనర్‌ తంజిద్‌ హసన్‌ 101 పరుగులతో శతకాన్ని నమోదు చేయగా.. నజ్ముల్‌ హొస్సేన్‌ శాంటో, మెహిదీ హసన్‌ మిరాజ్‌ కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో బంగ్లాదేశ్‌కు ఏకంగా 228 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది.

రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కాస్త ప్రతిఘటించింది. కామెరాన్‌ గ్రీన్‌ అద్భుతమైన సెంచరీతో జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. దీంతో ఆస్ట్రేలియా 284 పరుగులు చేయగలిగింది. ఫలితంగా బంగ్లాదేశ్‌ ముందు 57 పరుగుల స్వల్ప లక్ష్యం నిలిచింది. ఈ లక్ష్యాన్ని బంగ్లా బ్యాటర్లు ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించారు.

బౌలర్ల విజృంభణ

బంగ్లాదేశ్‌ చారిత్రక విజయానికి ఆ జట్టు బౌలర్లు ప్రధాన కారణంగా నిలిచారు. తొలి ఇన్నింగ్స్‌లో హసన్‌ మహ్మూద్‌ ఆరు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ వెన్నువిరిచాడు. రెండో ఇన్నింగ్స్‌లో మెహిదీ హసన్‌ మిరాజ్‌ ఐదు వికెట్లతో చెలరేగాడు. సమష్టిగా బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సత్తా చాటిన బంగ్లాదేశ్‌.. ఆస్ట్రేలియా గడ్డపై చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.