CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 16 August 2026, 12:41 pm Posted by : CHAITHANYA GALAM NEWS

శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో తప్పిన పెను ప్రమాదం

  • బ్రేక్‌ఫెయిల్‌తో అదుపుతప్పిన డీసీఎం.. కారును ఢీకొట్టి బోల్తా

నంద్యాల, ఆగస్టు 16(చైతన్యగళం): శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో ఆదివారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. శ్రీశైలానికి బియ్యం లోడుతో వెళ్తున్న డీసీఎం వ్యాన్‌ మార్గమధ్యలో బ్రేక్‌ఫెయిల్‌ కావడంతో అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించుకునే ప్రయత్నంలో కారును ఢీకొట్టిన డీసీఎం.. అనంతరం రహదారికి అడ్డంగా బోల్తాపడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారికి స్వల్ప గాయాలయ్యాయి.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంతో ఘాట్‌ రోడ్డుపై కొంతసేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

సెలవు రోజు.. భారీగా రద్దీ

ఆదివారం సెలవు దినం కావడంతో శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో వాహనాల రద్దీ అధికంగా ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో డీసీఎం రహదారికి అడ్డంగా బోల్తాపడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేశారు.