- 80 మీటర్ల జాతీయ పతాకంతో వైభవంగా ఫ్లాగథాన్
హైదరాబాద్, ఆగస్టు 15 (చైతన్యగళం): దేశభక్తి, జాతీయ సమైక్యత, సామాజిక బాధ్యతను చాటుతూ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వీ వైశ్య హైదరాబాద్ ఆధ్వర్యంలో 80 మీటర్ల భారీ జాతీయ పతాకంతో ఫ్లాగథాన్‌ను ఘనంగా నిర్వహించారు. భారీ జాతీయ జెండాతో వీ వైశ్య సభ్యులు ఉత్సాహంగా కదం తొక్కడంతో నగరంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్, TPCC జనరల్ సెక్రటరీ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరై ఫ్లాగథాన్‌ను ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడంతో పాటు, వారి ఆశయాలకు అనుగుణంగా దేశాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
భారీ జాతీయ పతాకంతో కదం తొక్కిన సభ్యులు
వీ వైశ్య తెలంగాణ నాయకులు డా. నిశాంక్, రాజేష్, శ్రీకాంత్, వెంకటరవి కుమార్, ప్రణీత్ కుమార్, మహేశ్వరమూర్తి తదితరులు, సభ్యులు పెద్ద సంఖ్యలో ఫ్లాగథాన్‌లో పాల్గొన్నారు. 80 మీటర్ల భారీ జాతీయ పతాకాన్ని చేతబూని ముందుకు సాగుతూ దేశభక్తి నినాదాలతో సందడి చేశారు. జాతీయ జెండా రెపరెపలాడుతుండగా సాగిన ఫ్లాగథాన్ చూపరులను ఆకట్టుకుంది.

స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా కాకుండా దేశం పట్ల ప్రతి పౌరుడి బాధ్యతను గుర్తుచేసే సందర్భంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ సమైక్యత, సామాజిక సేవ, దేశాభివృద్ధి వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
వ్యాపార, వాణిజ్య రంగాల్లో తమదైన ముద్ర వేస్తున్న వైశ్య సమాజం దేశభక్తి, సామాజిక సేవ, జాతీయ సమైక్యతలోనూ ముందుండాలనే సందేశాన్ని ఈ ఫ్లాగథాన్ ద్వారా చాటిచెప్పింది.
“వ్యాపారంలోనే కాదు.. దేశభక్తిలోనూ మా స్ఫూర్తి, మా భాగస్వామ్యం ఎంతో గొప్పది” అనే సందేశంతో నిర్వహించిన ఈ ఫ్లాగథాన్ నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంది. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ కార్యక్రమం దేశభక్తి, ఐక్యత, సేవా స్ఫూర్తికి ప్రతీకగా నిలిచింది.