CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 2:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

మర్రిగూడలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

మర్రిగూడ, ఆగస్టు 15 (చైతన్యగళం): మర్రిగూడ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రి, రాజకీయ పార్టీ కార్యాలయాలు, గ్రామపంచాయతీల వద్ద జాతీయ పతాకాలను ఆవిష్కరించి స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు.

భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 అత్యంత పవిత్రమైన రోజని, 1947 ఆగస్టు 15న సుమారు 200 ఏళ్ల బ్రిటిష్ వలస పాలన నుంచి భారత్ విముక్తి పొంది స్వతంత్ర సార్వభౌమ దేశంగా ఆవిష్కృతమైందని పలువురు పేర్కొన్నారు. ఎందరో త్యాగధనుల పోరాటం, అంకితభావం, ప్రాణత్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని గుర్తుచేశారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశ ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.

మర్రిగూడ మండల తహసీల్దార్ కార్యాలయంలో జక్కర్తి శ్రీనివాసులు, నాంపల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దూది రాజు, మర్రిగూడ ఎస్సై బి. రాంబాబు, ఎంపీడీవో కార్యాలయంలో మున్నయ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు.

మర్రిగూడ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రూప్‌సింగ్, ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ శంకర్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ విద్యార్థులు దేశభక్తి సందేశాలను వినిపించారు.

అలాగే పలు రాజకీయ పార్టీ కార్యాలయాల్లో, మర్రిగూడ గ్రామపంచాయతీ కార్యాలయాల్లోనూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వీరమళ్ల శిరీష, లోకేష్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

మండల కేంద్రం నుంచి గ్రామాల వరకు ఎక్కడ చూసినా త్రివర్ణ పతాకాలు రెపరెపలాడగా, చిన్నారులు, యువత, ప్రజలు దేశభక్తి నినాదాలతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రత, అభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పాన్ని పలువురు వ్యక్తం చేశారు.