CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:35 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఆక్రమణలు, నిబంధనల ఉల్లంఘనలపై కొరడా

  • ఆమన్‌గల్‌లో కమిషనర్ ఆకస్మిక తనిఖీలు.. వ్యాపార సంస్థలకు రూ.10 వేల వరకు జరిమానాలు

ఆమన్‌గల్, ఆగస్టు 14 (చైతన్యగళం):
ఆమన్‌గల్ పట్టణంలో పారిశుధ్యం, ప్రజారోగ్యం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. మున్సిపల్ కమిషనర్ ఎస్. రాఘవేందర్ రెడ్డి శుక్రవారం హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ధాబాలు, చికెన్ సెంటర్లు, ఆటోమొబైల్ షోరూమ్‌లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత, ఆహార హైజీన్ ప్రమాణాలు, ట్రేడ్ లైసెన్స్‌లను పరిశీలించి నిబంధనలు ఉల్లంఘించిన, లైసెన్స్‌లు లేని వ్యాపార సంస్థలపై రూ.10 వేల వరకు జరిమానాలు విధించారు. నిబంధనలు పాటించకపోతే మరింత అధిక జరిమానాలతో పాటు అవసరమైతే సంస్థలను సీజ్ చేస్తామని కమిషనర్ హెచ్చరించారు.
అనంతరం పోలీసు, ట్రాఫిక్ సిబ్బందితో కలిసి బస్‌స్టాండ్, హైదరాబాద్–కల్వకుర్తి ప్రధాన రహదారిని పరిశీలించారు. ఫుట్‌పాత్‌లు, రహదారి మార్జిన్‌లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులను గుర్తించి ఆక్రమణలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. ప్రజా రహదారులు, ఫుట్‌పాత్‌లు, మున్సిపల్ స్థలాల్లో ఆక్రమణలను సహించబోమని, ప్రజల రాకపోకలకు ఇబ్బంది కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణ పరిశుభ్రత, ప్రజారోగ్యం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని కోరారు. తనిఖీల్లో ఇన్‌చార్జి మేనేజర్ అంజనేయులు, మున్సిపల్ సిబ్బంది రాజశేఖర్, రమేష్, రామకృష్ణ, మెహబూబ్ తదితరులు పాల్గొన్నారు.