CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:42 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఖర్గేకు అవమానంపై కరీంనగర్‌లో కాంగ్రెస్ గర్జన

కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం):     కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అవమానానికి గురైన ఘటనను నిరసిస్తూ కరీంనగర్‌ జిల్లా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ పాదయాత్ర, సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు. కిసాన్‌నగర్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం నుంచి కోర్టు చౌరస్తాలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు పాదయాత్ర నిర్వహించి, అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు డాక్టర్‌ మేడిపల్లి సత్యం హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దశాబ్దాలు గడిచినా కుల వివక్ష, అంటరానితనం పూర్తిగా నిర్మూలించబడకపోవడం దురదృష్టకరమన్నారు. ఖర్గేను అవమానించడం దళిత, బహుజన సమాజాన్ని అవమానించినట్లేనని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఖర్గేతో పాటు దేశంలోని దళిత, బహుజన సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. దోషులపై చర్యలు తీసుకోకపోతే రాహుల్‌ గాంధీ నాయకత్వంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు మల్లేశం, మాజీ సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యువజన నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.