CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 8:43 pm Posted by : rakeshkashaveni12@gmail.com

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

సిద్దిపేట, ఆగస్టు 14 (చైతన్యగళం):          ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ కోసం జిల్లా కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ కార్యాలయ ఆవరణలోని పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ కె. హైమావతి శుక్రవారం సాయంత్రం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని ముఖ్య అతిథి, ఇతర ప్రముఖులు, అధికారులు, మీడియా ప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రోటోకాల్‌ ప్రకారం ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ సమైక్యత ప్రతిబింబించేలా వేడుకలను నిర్వహించాలని సూచించారు. ముందుగా నిర్దేశించిన సమయానుసారం పోలీస్‌ పరేడ్‌, ముఖ్య అతిథి ప్రసంగం, శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రశంసా పత్రాల ప్రదానం తదితర కార్యక్రమాలను నిర్వహించాలని తెలిపారు. వేదిక అలంకరణ, ధ్వని వ్యవస్థ, వివిధ శాఖల స్టాళ్ల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, ఆర్డీవో సదానందం, తహసీల్దార్‌ కిరణ్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.