CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 14 August 2026, 9:03 pm Posted by : rakeshkashaveni12@gmail.com

కరీంనగర్‌లో ఘనంగా హర్ ఘర్ తిరంగా భారీ ర్యాలీ

కరీంనగర్, ఆగస్టు 14 (చైతన్య గళం): భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌లో భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ చౌక్‌ నుంచి రామ్‌నగర్‌ వరకు సాగిన ర్యాలీలో కళాశాల విద్యార్థులు, యువత, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేతుల్లో త్రివర్ణ పతాకాలు పట్టుకుని ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాతరం’ నినాదాలతో ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ధర్మారావు మాట్లాడుతూ ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమం జాతీయ భావాలను పెంపొందించే గొప్ప ఉద్యమమని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవాలని, కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రతి భారతీయుడు జాతీయ జెండా నీడన ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం మాట్లాడుతూ ర్యాలీని విజయవంతం చేసిన విద్యార్థులు, యువత, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బుడిగే శోభ, నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్‌రావు, మాజీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.