- కిసాన్‌నగర్ ఘర్షణ.. ఏడుగురి అరెస్టు
- 29వ డివిజన్ కార్పొరేటర్ సహా నిందితులపై కేసు.. రిమాండ్‌కు తరలింపు
- చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: డీసీపీ వెంకటరమణ
కరీంనగర్ టౌన్, ఆగస్టు 11 (చైతన్యగళం): కిసాన్‌నగర్‌లో జరిగిన ఘర్షణ ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో 29వ డివిజన్ కార్పొరేటర్ సోమిడి వేణు ప్రసాద్ ఉన్నారు. ఈ మేరకు కరీంనగర్ డీసీపీ వెంకటరమణ వివరాలు వెల్లడించారు.
కరీంనగర్ III టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కిసాన్‌నగర్ వేపచెట్ల గ్రౌండ్ వద్ద ఈ నెల 9న రాత్రి సుమారు 10.30 గంటలకు ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు FIR No.274/2026 నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఈ కేసులో BNS సెక్షన్లు 191(2), 191(3), 109(1) r/w 190తో పాటు SC/ST (Prevention of Atrocities) Amendment Act-2015లోని 3(1)(r)(s), 3(2)(va), 3(2)(v) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్టయిన నిందితులు
కేసులో **A-1 సోమిడి వేణు ప్రసాద్ (40), A-2 కుడిది నాగేందర్ @ నాగేంద్ర బాబు (31), A-3 పంతంగి మధు @ మధుకర్ (29), A-4 నెరెళ్ల నాగరాజు @ రాజు (32), A-5 శ్రీరామోజు భానుచందర్ @ భాను (30), A-6 సంగం వేణు @ చరణ్ (19), A-7 పంతంగి శశిధర్ @ చింటూ (28)**లను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో కొందరు కిసాన్‌నగర్, మరొకరు బొమ్మకల్ ప్రాంతానికి చెందినవారని తెలిపారు.
నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, దర్యాప్తు అనంతరం నిందితులను చట్ట ప్రకారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ వెంకటరమణ తెలిపారు.
శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని డీసీపీ వెంకటరమణ స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఎలాంటి మినహాయింపులు లేకుండా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.