సిద్దిపేట, ఆగస్టు 5 (చైతన్యగళం):
ప్రభుత్వ పాఠశాలల్లో క్రమశిక్షణ, సమయపాలనతో నాణ్యమైన విద్యాబోధన అందించి విద్యార్థులను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఉపాధ్యాయులకు సూచించారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవనంలో ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, కేజీబీవీ ప్రత్యేక అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ విద్యాశాఖ పనితీరును సమీక్షించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, బోధన నాణ్యతపై రాజీ పడొద్దని సూచించారు. ఉపాధ్యాయుల హాజరు, పాఠ్యాంశాల బోధన, మధ్యాహ్న భోజనం నాణ్యతను ప్రతిరోజూ పర్యవేక్షించాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు.
బడి మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని, విద్యార్థుల ఆధార్ నవీకరణను వెంటనే పూర్తి చేయాలని చెప్పారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని సూచించారు.విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు, యోగ, ధ్యానం అలవాటు చేయాలని, మెనూ ప్రకారం నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందేలా చూడాలని ఆదేశించారు. ఈనెల 15లోగా యూనిఫారాలు, పాఠ్యపుస్తకాలు, నోటుపుస్తకాలు అందజేసి ప్రతి మండలంలో ఒక ప్రభుత్వ పాఠశాలను ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు.