CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 1:16 pm Posted by : rakeshkashaveni12@gmail.com

మండల స్థాయిలో ప్రతి సోమవారం ప్రజావాణి 

హైదరాబాద్, ఆగస్టు 4 (చైతన్య గళం): 

ప్రజల సమస్యలను స్థానిక స్థాయిలోనే వేగంగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని మండల స్థాయికి విస్తరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య–4, తేదీ: 04-08-2026 ను జారీ చేసింది. ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎంపీడీఓ నోడల్ అధికారిగా వ్యవహరించగా, తహసీల్దార్, మండల వ్యవసాయ అధికారి, మండల విద్యాశాఖ అధికారి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి, పోలీసు శాఖతో పాటు ఇతర మండల స్థాయి అధికారులు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి తక్షణ చర్యలు చేపట్టనున్నారు. అందిన ప్రతి ఫిర్యాదును ప్రజావాణి ఆన్‌లైన్‌ పోర్టల్ లో నమోదు చేసి, ఫిర్యాదుదారునికి ఫిర్యాదు గుర్తింపు సంఖ్య తో కూడిన రసీదును అందజేస్తారు. వికలాంగులు, వృద్ధులు, గర్భిణులు, బాలింతలకు తొలి ప్రాధాన్యత కల్పించనున్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో మంచినీరు, కూర్చునే సీట్లు, సహాయ కేంద్రం వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజా సమస్యలను మండల స్థాయిలోనే త్వరితగతిన పరిష్కరించేందుకు జిల్లా కలెక్టర్లు చర్యలు చేపట్టాలని సూచించింది.