కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్య గళం):
నూతన జిల్లా కలెక్టరేట్ భవనానికి కార్యాలయాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపట్టి, ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. పాత కలెక్టరేట్ నుంచి తరలించే ఫైళ్లు, కంప్యూటర్లు, ఫర్నిచర్, ఇతర సామగ్రి దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సాయంత్రం నూతన కలెక్టరేట్ భవనాన్ని కలెక్టర్ పరిశీలించి, వివిధ శాఖల కార్యాలయాలు, అధికారుల ఛాంబర్లు, సమావేశ మందిరాలు, వీవీఐపీ గదులను తనిఖీ చేశారు. ప్రతి శాఖకు సంబంధించిన కార్యాలయాలను ప్రణాళికబద్ధంగా కేటాయించి, ఉద్యోగుల సిట్టింగ్‌ను పూర్తి చేయాలని ఆదేశించారు.ఏసీలు, ఫర్నిచర్, విద్యుత్, తాగునీరు, టీ-ఫైబర్ నెట్‌వర్క్ తదితర మౌలిక వసతులు ప్రారంభానికి ముందే సిద్ధంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అన్ని శాఖల సమన్వయంతో షిఫ్టింగ్ ప్రక్రియను వేగంగా పూర్తి చేసి, మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి నూతన కలెక్టరేట్‌ను ప్రారంభానికి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీవో షర్మిల, ఆర్ అండ్ బీ అధికారులు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.