CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 05 August 2026, 9:57 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఆస్పత్రుల రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి

కరీంనగర్, ఆగస్టు 5 (చైతన్య గళం):

జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల రిజిస్ట్రేషన్, రెన్యువల్ దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం–2010 కింద ఏర్పాటు చేసిన జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ సమావేశం బుధవారం కలెక్టర్ ఛాంబర్‌లో జరిగింది. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్, రెన్యువల్ కోసం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు, వివిధ శాఖల నుంచి రావాల్సిన నిరభ్యంతర ధ్రువపత్రాల (ఎన్‌వోసీ) స్థితిపై కలెక్టర్ సమీక్షించారు. పోలీసు, అగ్నిమాపక, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేసి అన్ని దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. నిబంధనలు పాటించని ఆస్పత్రులకు లోపాలను తెలియజేసి సరిచేసుకునే అవకాశం ఇవ్వాలని, అర్హత కలిగిన ఆస్పత్రులకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలని సూచించారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం ప్రతి ప్రైవేట్ ఆస్పత్రి తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, ప్రతి ఐదేళ్లకోసారి రెన్యువల్ చేసుకోవాలని కలెక్టర్ స్పష్టం చేశారు. రిజిస్ట్రేషన్ లేకుండా వైద్య సేవలు అందించరాదన్నారు. అలాగే ఆస్పత్రుల్లో రిజిస్ట్రేషన్ ధ్రువపత్రం, సేవల చార్జీల వివరాలను ప్రజలకు కనిపించేలా ప్రదర్శించాలని, అర్హత కలిగిన వైద్యులు, సిబ్బందితోనే సేవలు అందేలా పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. రాజగోపాలరావు, జిల్లా అగ్నిమాపక అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఐఎంఏ ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.