దుబ్బాక, ఆగస్టు 5 (చైతన్యగళం):
సీజనల్ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు గురుకుల పాఠశాలల్లో కామన్ డైట్ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆదేశించారు. బుధవారం దుబ్బాకలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ మధ్యాహ్న భోజనం, వంటశాల, స్టోర్‌రూమ్‌ను పరిశీలించారు.
బిర్యానీ రైస్ నాణ్యత సరిగా లేదని గుర్తించి, అవసరమైన పదార్థాలను సమపాళ్లలో ఉపయోగించి రుచికరంగా వండి విద్యార్థులకు అందించాలని ప్రిన్సిపాల్‌ను హెచ్చరించారు ప్రతి రోజు కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా అమలు చేయాలని, విద్యార్థుల హాజరుకు అనుగుణంగా వంట సామగ్రిని వినియోగించాలని సూచించారు. వంటగది, స్టోర్‌రూమ్ పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవడంతో పాటు నాణ్యమైన బియ్యం, గుడ్లు, కూరగాయలు, ఇతర వంటసరుకులనే ఉపయోగించాలని ఆదేశించారు. విద్యార్థులకు జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సేవలు అందించాలని, అవసరమైతే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. గురుకులంలో బియ్యం నాణ్యతపై వచ్చిన ఫిర్యాదుతో వెంటనే జిల్లా పౌర సరఫరాల అధికారిని సంప్రదించి నాణ్యమైన బియ్యం సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే గురుకులంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు.