కరీంనగర్, ఆగస్టు 4{చైతన్యగళం}:
బిడ్డ పుట్టిన గంటలోపే శిశువుకు తల్లిపాలు పట్టిస్తే జీవితాంతం సంపూర్ణ ఆరోగ్యంతో ఎదుగుతారని జిల్లా సంక్షేమ అధికారి ఎం. సరస్వతి అన్నారు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కరీంనగర్‌లోని జ్యోతి నగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీలు, బాలింతలకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పుట్టిన వెంటనే ఇచ్చే ముర్రుపాలు అమృతంతో సమానమని, తల్లిపాలలో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయని తెలిపారు. శిశువుకు తొలి ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, అనంతరం తల్లిపాలతో పాటు అనుబంధ పోషకాహారం అందించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే బాలామృతం పిల్లల ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలని, తల్లిపాలు అందించడంలో కుటుంబ సభ్యులు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, చైల్డ్ హెల్ప్‌లైన్ కేస్ వర్కర్ మహేష్, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు.