CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:19 pm Posted by : CHAITHANYA GALAM NEWS

డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు అవగాహన

పెద్దపల్లి, ఆగస్టు 4(చైతన్యగళం): రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు రామగిరి మండలం రాజాపూర్ గ్రామంలో పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో డ్రగ్స్, సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

రామగిరి ఎస్సై శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మంథని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ బుద్దె స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యువత గంజాయి, డ్రగ్స్, మద్యం, సిగరెట్లు వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని విద్య, ఉపాధిపై దృష్టి సారించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు.

సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, లక్కీ డ్రా, బహుమతులు, బ్యాంకు ఖాతా ధృవీకరణ పేరుతో ఫోన్ చేసి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు అడిగే మోసగాళ్లను నమ్మవద్దని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.

గ్రామాల్లో దొంగతనాలు, ఇతర నేరాల నివారణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించిన సీఐ, మూఢనమ్మకాల పేరుతో జరిగే మోసాల పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. గంజాయి విక్రయించే వారు లేదా మత్తు పదార్థాలు సేవించే వారి గురించి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ట్రాఫిక్ నిబంధనలను తప్పకుండా పాటించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్‌కు పాల్పడవద్దని సూచించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనాల నంబర్ ప్లేట్లలో ఎలాంటి మార్పులు చేయరాదని తెలిపారు. రాంగ్ రూట్‌లో ప్రయాణించడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల ఈ-చలాన్ ద్వారా జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో రాజాపూర్ గ్రామ సర్పంచ్ పుల్లెల్ల భాగ్యలక్ష్మి కొమురయ్య, ఉపసర్పంచ్ కళావేణ శ్రీకాంత్, గ్రామ పెద్దలు, యువత, మహిళలు, గ్రామస్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.