CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 04 August 2026, 10:04 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రభుత్వ ధాన్యం మళ్లిస్తే క్రిమినల్ కేసులు: మంత్రి ఉత్తమ్

రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం బకాయిలు పడి, ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.

హైదరాబాద్, ఆగస్టు 04(చైతన్యగళం): రాష్ట్రంలో కస్టమ్ మిల్లింగ్ బియ్యం (CMR) బకాయిలు పడి, ప్రభుత్వ ధాన్యాన్ని మళ్లించిన డిఫాల్ట్ రైస్ మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి సిద్ధమైంది. సచివాలయంలో పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సీఎంఆర్ ప్రక్రియలోని ప్రతి ధాన్యపు గింజ ప్రజల ఆస్తి అని, ప్రజాధనంతో పాటు ప్రభుత్వ ధాన్యాన్ని రికవరీ చేయడానికే తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు.

గత 10 నుంచి 12 ఏళ్ల కాలంలో జరిగిన సీఎంఆర్ కార్యకలాపాలపై సమగ్రమైన ‘ప్రత్యేక ఆడిట్’ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. మిల్లుల వారీగా పక్కా ప్రణాళికతో, నిర్దిష్ట కాలపరిమితితో బకాయి ఉన్న బియ్యం, నగదు లేదా ధాన్యాన్ని రికవరీ చేయాలని అధికారులను ఆదేశించారు. అక్రమాలకు పాల్పడిన మిల్లర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడమే కాకుండా, బ్యాంకు గ్యారంటీలను నెరవేర్చి ఆస్తుల జప్తు ప్రక్రియను వేగవంతం చేయాలని, విజిలెన్స్ తనిఖీలను విస్తృతం చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.

భవిష్యత్తులో ధాన్యం మళ్లింపును నిరోధించడానికి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్, క్యూఆర్ కోడ్ కలిగిన గన్నీ బ్యాగులు, వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వంటి సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సీఎంఆర్ నిబంధనలను మరింత కఠినతరం చేసేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. అయితే నిజాయితీగా పనిచేసే మిల్లర్లకు ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే సమయంలో రైతుల వద్ద నుంచి కనీస మద్దతు ధరకే (MSP) ధాన్యం కొనుగోళ్లు, నేరుగా ఖాతాల్లోకి నగదు జమ (DBT) ప్రక్రియలు ఎప్పటిలాగే పారదర్శకంగా సాగుతాయని మంత్రి స్పష్టం చేశారు.