CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 11:13 am Posted by : CHAITHANYA GALAM NEWS

కళాకారులకు పెద్దన్న… పేదలకు భరోసా – ఈగ మల్లేశం

హనుమకొండ, ఆగస్టు 2 (చైతన్యగళం):
కళాకారుల సంక్షేమం, నిరుపేదలకు చేయూత, విద్యార్థులకు విద్యాసహాయం, సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు పొందిన ఈగ మల్లేశం గారు ఘన సత్కారం అందుకున్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, గానకోకిల ఎస్. జానకి మధురస్మృతులను స్మరించుకుంటూ నిర్వహించిన “స్వరాభిషేకం” మహోత్సవ వేదికగా ఈ సన్మానం జరిగింది.ఈ సందర్భంగా ఈగ మల్లేశం–సంగీత దంపతులకు గజమాలతో ఘనంగా సన్మానం చేసి సన్మాన పత్రాన్ని అందజేశారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్న ఆయన సేవా ప్రస్థానాన్ని నిర్వాహకులు కొనియాడారు.

రాజకీయ, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో ఆయన అందించిన సేవలను గుర్తుచేస్తూ ఘనంగా సత్కరించారు.కళాకారుల సంక్షేమ మండలి అధ్యక్షునిగా ఆయన కళాకారుల సమస్యల పరిష్కారానికి, మరుగునపడుతున్న జానపద కళారూపాలకు గుర్తింపు కల్పించేందుకు కృషి చేస్తున్నారు. నాటకాల్లో నటుడిగా, సినిమాల్లో రచయితగా, గాయకుడిగా కూడా తన అనుబంధాన్ని కొనసాగించారు.నిరుపేద కుటుంబాలకు వివాహ సహాయం, విద్యార్థులకు విద్యాసహాయం, పేదలకు గృహనిర్మాణానికి సహకారం, ఆపదలో ఉన్న కుటుంబాలకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను నిర్వాహకులు ప్రస్తావించారు. కరోనా సమయంలోనూ కళాకారులు, నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలు, ఆర్థిక సహాయం అందించారు.అఖిల భారత పద్మశాలి జాతీయ అధ్యక్షునిగా చేనేత కుటుంబాల సంక్షేమానికి కృషి చేశారు. తెలంగాణ ఉద్యమంలో ‘దూంధాం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో ఉద్యమస్ఫూర్తి నింపారు. జేఏసీ తొలి కన్వీనర్‌గా కూడా పనిచేశారు.కేంద్ర ఖాదీ, చిన్న పరిశ్రమల సంస్థ డైరెక్టర్‌గా గ్రామీణాభివృద్ధి, స్వయం ఉపాధి రంగాలకు సేవలందించారు. స్వాతంత్ర్య సమరయోధుల వారసుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.

నిర్వాహకులు మాట్లాడుతూ, “ఒక వ్యక్తిని కాదు… ఒక సేవా తత్వాన్ని సత్కరిస్తున్నాం. కళాకారులకు అందించిన సహాయం కేవలం ఆర్థిక బలం కాదు, వారి ఆత్మవిశ్వాసానికి అభయహస్తం. పేదలకు అందించిన చేయూత మానవత్వానికి చేసిన మహాయజ్ఞం” అని కొనియాడారు.ఈ సందర్భంగా కళాసేవ రత్న అవార్డు గ్రహీత ఈగ మల్లేశం మాట్లాడుతూ, “మద్రాస్‌లో బాలసుబ్రహ్మణ్యం నిర్వహించిన స్వరాభిషేక కార్యక్రమంలో నాకు అవార్డు ఇవ్వాలని నిర్ణయించారు. కానీ నేను వెళ్లలేకపోయాను. వరంగల్‌లో మా కళాకారుల కోరిక మేరకు ఈ సన్మానం జరగడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కుటుంబం కళాకారులకు చెందింది. కలల కోసం అహర్నిశలు కృషి చేస్తాను” అని అన్నారు.