CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 12:34 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలి: జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

హుజూరాబాద్, జూలై 31(చైతన్యగళం):

ప్రజలకు సంబంధించిన ప్రతి దరఖాస్తును నిర్ణీత గడువులోగా పరిష్కరించి, ప్రభుత్వ సేవలను వేగవంతంగా అందించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.శుక్రవారం రాత్రి హుజూరాబాద్ ఆర్డీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, కార్యాలయ పనితీరును పరిశీలించి ఆర్డీవో జల కుమారి, తహసీల్దార్ నరేందర్‌తో సమావేశమై ప్రభుత్వ కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) కార్యక్రమం పురోగతిని పరిశీలించిన ఆమె, ఇంటింటి సర్వే, ఓటరు జాబితా సవరణ, దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజావాణి, భూ భారతి–సాదా బైనామా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరిష్కారంపై వివరాలు తెలుసుకుని, అర్హులైన దరఖాస్తుదారులకు జాప్యం లేకుండా సేవలు అందించాలని ఆదేశించారు. డివిజన్ పరిధిలో పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, ఆరోగ్య సేవలు, వర్షాకాల ముందస్తు చర్యలపై కూడా సమీక్షించిన కలెక్టర్, సీజనల్ వ్యాధుల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టి గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా స్పష్టం చేశారు.