CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:44 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఆగస్టు 10 వరకు ఎస్‌ఐఆర్‌ గడువు.. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి

సిద్దిపేట, ఆగస్టు 1 (చైతన్యగళం):

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 10వ తేదీ వరకు పొడిగించినందున జిల్లాలోని అర్హులైన ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కే. హైమావతి తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆమె ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో 99.75 శాతం ఓటర్ల డిజిటలైజేషన్ పూర్తయిందని, మరణించిన ఓటర్లు, డబుల్‌ ఎంట్రీలు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా మారిన వారి పేర్లను తొలగించినట్లు తెలిపారు. ఆగస్టు 17న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసి, సెప్టెంబర్‌ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించి, అక్టోబర్‌ 16 నాటికి వాటిని పరిష్కరించి, అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుందని వెల్లడించారు. అలాగే 1,200 మందికి పైగా ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణపై కూడా సమావేశంలో చర్చించారు. సమావేశంలో శిక్షణ డిప్యూటీ కలెక్టర్ భవ్య, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.