CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:05 pm Posted by : CHAITHANYA GALAM NEWS

పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ..!

  • నకిలీ ధ్రువీకరణ పత్రాలతో 188 గజాల భూమి కబ్జాకు యత్నం
  • బాధ్యుడిపై చర్యలు కోరుతూ కార్యదర్శి ఫిర్యాదు.. కేసు నమోదు చేసిన పోలీసులు

మర్రిగూడ, ఆగస్టు 1 (చైతన్యగళం): ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి భూమిని కబ్జా చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘటన నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని కుదాబాక్షపల్లి గ్రామపంచాయతీ పరిధిలో వెలుగుచూసింది. నకిలీ ఇంటి పన్ను ధ్రువీకరణ పత్రాలను సృష్టించి 188 గజాల స్థలాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నించినట్లు ఆరోపణలు రావడంతో విషయం పోలీసుల దృష్టికి చేరింది.

గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రసన్నబాబు శనివారం మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదులో, కుదాబాక్షపల్లి గ్రామానికి చెందిన బొంత మల్లేష్ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఇంటి పన్ను చెల్లింపు రికార్డులు, ఇతర గ్రామపంచాయతీ ధ్రువీకరణ పత్రాలను నకిలీగా రూపొందించినట్లు పేర్కొన్నారు. ఆ నకిలీ పత్రాలను ఆధారంగా చేసుకుని 188 గజాల భూమిపై హక్కు సాధించేందుకు ప్రయత్నించినట్లు ఫిర్యాదులో వివరించారు.

ఫిర్యాదు ఆధారంగా మర్రిగూడ ఎస్‌ఐ బి. రాంబాబు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫోర్జరీకి వినియోగించిన పత్రాల అసలుదనాన్ని, భూమి యాజమాన్యానికి సంబంధించిన రికార్డులను పోలీసులు పరిశీలిస్తున్నారు. దర్యాప్తులో వాస్తవాలు తేలిన అనంతరం బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.