CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 1:13 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

  • భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

విజయనగరం , ఆగస్టు 1 (చైతన్యగళం): భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారని కొనియాడారు. రాజధాని అమరావతికి నిధులు ఇచ్చి ప్రధాని అండగా నిలిచారని ఉద్ఘాటించారు. పోలవరం, రైల్వేజోన్‌, విశాఖ ఉక్కును మోదీ కాపాడారని ప్రశంసించారు. ఎయిర్‌పోర్ట్‌కు భూములు ఇచ్చిన రైతులకు పాదాభివందనాలు చేస్తున్నానని పేర్కొన్నారు. ఏపీని పునర్‌నిర్మాణం చేస్తామని హామీ ఇచ్చామని.. చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ రోజు(శనివారం) భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగించారు.

ఎర్రబస్సు రాదని కొందరు హేళన చేశారు..

ఈ ప్రాంతానికి ఎర్రబస్సు కూడా రాదని కొందరు హేళన చేశారని సీఎం విమర్శించారు. అవహేళన చేసినవారు అడ్రస్‌ లేకుండా పోయారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఉత్తరాంధ్రలో సరికొత్త చరిత్రకు నాంది పలికామని ఉద్ఘాటించారు. గూగుల్‌, స్టీల్‌ కంపెనీలతోపాటు చాలా సంస్థలు వచ్చాయని వివరించారు. ఉత్తరాంధ్ర దశ, దిశ మారబోతున్నాయని వెల్లడించారు. రెండేళ్ల క్రితం విధ్వంసమైన రాష్ట్రాన్ని చూశామని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ సహకారంతో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టులకు పెట్టుబడులు రాబోతున్నాయని వివరించారు. ఉత్తరాంధ్రలో అన్నిరకాల వనరులు ఉన్నాయని వెల్లడించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. ఇక్కడికే ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చేలా చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

దేశాన్ని మోదీ 12 ఏళ్లుగా సమర్థంగా నడిపిస్తున్నారు..

దేశాన్ని మోదీ 12 ఏళ్లుగా సమర్థంగా నడిపిస్తున్నారని సీఎం కొనియాడారు. దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చే ఘనత మోదీదేనని ప్రశంసల వర్షం కురిపించారు. సౌరశక్తి, గ్రీన్ హైడ్రోజన్‌ ద్వారా కాలుష్యం తగ్గిస్తున్నారని తెలిపారు. దేశంలో తీవ్రవాదం, నక్సలిజం లేకుండా చేశారని చెప్పుకొచ్చారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం సుభిక్షంగా ఉందని వెల్లడించారు. మోదీ లాంటి నేతను తన రాజకీయ జీవితంలోనే చూడలేదని అన్నారు. నేషన్‌ ఫస్ట్‌ అనే ప్రధానిని తొలిసారి చూస్తున్నామని చెప్పారు. 2047లోగా ప్రపంచంలోనే నెంబర్‌వన్‌గా భారత్‌ ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.