CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 9:09 pm Posted by : CHAITHANYA GALAM NEWS

కరీంనగర్ జిల్లా వైద్యాధికారిగా డా. రాజగోపాల్ బాధ్యతల స్వీకరణ

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):
కరీంనగర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా విశిష్ట సేవలు అందించిన డా. శ్రీరాం పదవీ విరమణ పొందగా, నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారిగా డా. రాజగోపాల్ శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో డా. శ్రీరాం నూతన అధికారికి బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నోడల్ అధికారులు డా. రాజగోపాల్‌ను ఘనంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. డా. శ్రీరాం అందించిన సేవలను కొనియాడుతూ, ఆయన పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలు అనుభవించాలని ఆకాంక్షించారు.

డా. శ్రీరాం మాట్లాడుతూ, “జిల్లాలో తన పదవీకాలంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో అందరూ సమష్టిగా కృషి చేశారు. అదే స్ఫూర్తితో నూతన జిల్లా వైద్యాధికారికి పూర్తి సహకారం అందించాలి” అని పేర్కొన్నారు.నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డా. రాజగోపాల్ మాట్లాడుతూ, “ప్రభుత్వం నాపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా పూర్తి బాధ్యతతో విధులు నిర్వహిస్తాను. తల్లి–శిశు ఆరోగ్యం, సాధారణ టీకా కార్యక్రమం, కుటుంబ సంక్షేమ సేవలు, అంటువ్యాధుల నియంత్రణ, అసంక్రమిత వ్యాధుల నివారణ, ప్రజారోగ్య పరిరక్షణ, ఆరోగ్య సంస్థల బలోపేతం, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తాను” అని తెలిపారు.జిల్లాలో ఆరోగ్య సూచీల మెరుగుదలకు అధికారులు, వైద్యులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖలతో సమన్వయంగా పనిచేస్తూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు, వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాల జిల్లా అధికారులు, వైద్యాధికారులు, సిబ్బంది మరియు ఇతర ఉద్యోగులు పాల్గొని డా. రాజగోపాల్‌కు శుభాకాంక్షలు తెలిపారు.