CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 01 August 2026, 10:12 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన సదస్సు

కరీంనగర్, ఆగస్టు 1 (చైతన్యగళం):
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా కరీంనగర్ అర్బన్ ప్రాజెక్ట్, కోతిరాంపూర్ సెక్టార్ పరిధిలోని పోచమ్మవాడ అంగనవాడీ కేంద్రంలో శనివారం తల్లులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ కవిత మాట్లాడుతూ, “ప్రతి ఏటా ఆగస్టు నెలలో అన్ని అంగనవాడీ కేంద్రాల్లో తల్లిపాల విశిష్టతపై వారోత్సవాలు నిర్వహిస్తాం. బిడ్డ పుట్టిన వెంటనే గంటలోపు ముర్రుపాలు తప్పనిసరిగా పట్టాలి. మొదటి ఆరు నెలల పాటు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి” అని సూచించారు.

ఆమె వివరించిన ముఖ్యాంశాలు:
తల్లిపాలలో శిశువుకు అవసరమైన అన్ని పోషకాలు, వ్యాధినిరోధక శక్తిని పెంచే ప్రతిరక్షకాలు పుష్కలంగా ఉంటాయని, తల్లిపాలు తాగే పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు, విరేచనాలు, పోషకాహార లోపం తక్కువగా ఉంటాయని తెలిపారు. బిడ్డకు ఆరు నెలలు పూర్తయ్యాక అనుబంధ ఆహారం ఇస్తూనే, రెండేళ్ల వరకు తల్లిపాలు కొనసాగించడం సంపూర్ణ ఎదుగుదలకు దోహదం చేస్తుందని వివరించారు.

తల్లిపాలు ఇవ్వడం వల్ల ప్రసవానంతరం తల్లి త్వరగా కోలుకోవడమే కాకుండా అధిక రక్తస్రావం తగ్గుతుందని, కొన్ని రకాల క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతుందని చెప్పారు. గర్భిణులు సుఖ ప్రసవం కోసం సరైన ఆహారపు అలవాట్లు, వ్యాయామాలు పాటించాలని సూచించారు.

తల్లిపాలపై ఉన్న అపోహలను తొలగిస్తూ, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో తల్లులు భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎస్. అరుణ, బిసి సతీష్, అంగనవాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎం, గర్భిణులు, బాలింతలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.