నల్లగొండ, ఆగస్టు 1 (చైతన్యగళం):
నవంబర్‌లో నల్లగొండ జిల్లా కేంద్రంలో జరగనున్న అఖిల భారత కిసాన్ సభ 36వ జాతీయ మహాసభలు విజయవంతం కావాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు.శనివారం నల్లగొండ నియోజకవర్గస్థాయి విస్తృత సమావేశం ఎం.వి.ఎన్ విజ్ఞాన కేంద్రంలో జరిగింది. ఈ సందర్భంగా రంగారెడ్డి మాట్లాడుతూ, “కేంద్ర ప్రభుత్వం రైతు, వ్యవసాయ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. మద్దతు ధర చట్టం చేయకుండా విద్యుత్ సంస్కరణల బిల్లు తెచ్చి మోటార్లకు మీటర్లు బిగించడం దురదృష్టకరం. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్‌లకు అప్పగిస్తూ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెడుతోంది” అని ఆరోపించారు.ఆగస్టు 10న దేశవ్యాప్తంగా జైల్ భరో కార్యక్రమం నిర్వహించాలని, *“క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో సేవ్ ఇండియా నినాదం”*తో ప్రజా పోరాటాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు.సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ, “విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగాలి. ప్రైవేటీకరణ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలి. గ్రామస్థాయి వరకు బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలలపై సర్వేలు నిర్వహించి లోపాలను ప్రభుత్వ దృష్టికి తేవాలి” అని అన్నారు.ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షత వహించారు. సిపిఎం జిల్లా నాయకులు సయ్యద్ హషం, పాలడుగు నాగార్జున, పాలడుగు ప్రభావతి, దండెంపల్లి సత్తయ్య, నన్నూరి వెంకటరమణారెడ్డి, కొండ అనురాధ, నలపరాజు సైదులు, మన్నెం బిక్షం, ఊట్కూరి నారాయణరెడ్డి, తుమ్మల పద్మ, అవుట్ రవీందర్, దండెంపల్లి సరోజ, బ్రహ్మానంద రెడ్డి, దొంగరి వెంకన్న, భీమగాని గణేష్, సుల్తానా, గుండాల నరేష్, గండమల్ల రాములు, కొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.