మంచిర్యాల, జూలై 30(చైతన్యగళం):
ప్రస్తుతం కొనసాగుతున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందని, అత్యవసర పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు & భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు.
గురువారం మందమర్రి మున్సిపల్ పరిధిలోని 19, 7వ వార్డుల్లో వర్షాల ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఏసీపీ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజలింగుతో కలిసి పరిశీలించారు. కామాఖ్య అమ్మవారి ఆలయానికి వెళ్లే మార్గంలోని నీటి ప్రవాహాన్ని, కూలిన ఇంటి గోడను పరిశీలించి బాధిత కుటుంబానికి పరిహారం అందించి ఇంటి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కోటపల్లి మండలం ఆల్గాం గ్రామంలో జరిగిన గోడ కూలిన ఘటనపై కూడా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

చెన్నూర్ నియోజకవర్గంలోని వరద ప్రభావిత గ్రామాల్లో రవాణా అంతరాయం ఏర్పడకుండా అటవీ శాఖ, సంబంధిత శాఖల సమన్వయంతో రహదారి అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మందమర్రి మున్సిపల్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, భూభారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ వేగవంతం చేయాలని, పెండింగ్ దరఖాస్తులను నిబంధనల ప్రకారం త్వరగా పరిష్కరించాలని, మున్సిపల్ పన్నుల బకాయిల వసూళ్లను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.