CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:26 pm Posted by : rakeshkashaveni12@gmail.com

ఆగస్టులో మూడు నెలల సన్నబియ్యం ఒకేసారి పంపిణీ 

మంచిర్యాల, జూలై 30(చైతన్యగళం):

జిల్లాలోని రేషన్ కార్డుదారులకు ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్–2026 నెలలకు సంబంధించిన మూడు నెలల సన్నబియ్యాన్ని చౌక ధరల దుకాణాల ద్వారా ఒకేసారి పంపిణీ చేయనున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు తెలిపారు. జిల్లాలో సర్వర్‌కు సంబంధించిన సాంకేతిక సమస్యలు తలెత్తిన చోట్ల ఈ-పాస్ ఇంజనీర్లు వెంటనే పరిష్కరిస్తున్నారని, సన్నబియ్యం నిల్వలు తగినంతగా ఉన్నందున ప్రతి అర్హులైన రేషన్ కార్డుదారునికి బియ్యం అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పంపిణీ కార్యక్రమం ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని, లబ్ధిదారులు తొందరపడకుండా తమకు అనుకూలమైన సమయంలో సంబంధిత రేషన్ దుకాణంలో బియ్యాన్ని పొందవచ్చని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం 2,57,251 రేషన్ కార్డులు ఉన్నాయని, మండల స్థాయిలో తహసీల్దార్లు, జిల్లా స్థాయిలో జిల్లా పౌర సరఫరాల అధికారి పంపిణీ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షిస్తారని తెలిపారు. ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినా లేదా పక్కదారి మళ్లించినా తెలంగాణ ప్రజా పంపిణీ వ్యవస్థ (నియంత్రణ) ఆర్డర్–2016 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రేషన్ డీలర్ల లైసెన్స్ రద్దుతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, రేషన్ కార్డుదారులు బియ్యాన్ని విక్రయించినా వారి రేషన్ కార్డు రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.