CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 3:22 pm Posted by : CHAITHANYA GALAM NEWS

అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు వేయాలి: సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి

కల్వకుర్తి, జూలై 30(చైతన్యగళం): నిరుద్యోగ యువత అందుబాటులో ఉన్న ప్రతి ఉద్యోగ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, అదే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, TASK సీఓఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో నిర్వహించిన జాబ్ డ్రైవ్–ఇంటర్వ్యూ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అభ్యర్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ఉద్యోగ విపణిలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో యువత తమ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. యువతకు ఉపాధి కల్పించడం, వారి భవిష్యత్తును తీర్చిదిద్దడం లక్ష్యంగా ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి జాబ్ డ్రైవ్‌లు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు.

“యువతకు ఉద్యోగం – కుటుంబానికి భరోసా – సమాజానికి అభివృద్ధి” అనే లక్ష్యంతో నిర్వహించిన ఈ ఇంటర్వ్యూ కార్యక్రమానికి కల్వకుర్తి మండలం నుంచి 7, ఆమనగల్ మండలం నుంచి 4, తలకొండపల్లి మండలం నుంచి 5, కడ్తాల్ మండలం నుంచి 5 మంది చొప్పున నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 21 మంది నిరుద్యోగ యువత హాజరై ఇంటర్వ్యూలలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు వీర, శ్రీనివాస్‌తో పాటు ఐక్యత ఫౌండేషన్ సభ్యులు, నిరుద్యోగ యువత పాల్గొన్నారు.