కరీంనగర్, జూలై 30 (చైతన్యగళం):
కరీంనగర్ పదో డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ మైసమ్మ అమ్మవారి దేవాలయ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది.
ఈ వేడుకలకు నగర మేయర్ కోలగాని శ్రీనివాస్, స్థానిక కార్పొరేటర్ కొమరయ్యలు ముఖ్య అతిథులుగా హాజరై, అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్టా కార్యక్రమాలను కన్నుల పండుగగా నిర్వహించారు.

కాలనీ ప్రజలు అందరూ కలిసికట్టుగా బోనాలు సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో దేవాలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది.
ఈ సందర్భంగా మేయర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, “దైవభక్తి, ఆధ్యాత్మిక చింతన మానసిక ప్రశాంతతను ఇస్తాయి. స్థానికులు ఐక్యతతో ముందుకు వచ్చి దేవాలయాన్ని నిర్మించడం అభినందనీయమైనది. అమ్మవారి ఆశీస్సులు నగర ప్రజలందరిపై ఉండాలి, నగరం సుభిక్షంగా వర్ధిల్లాలి” అని ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల కల్పనకు తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ మహోత్సవంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ పెద్దలు, యువకులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.