CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 12:31 pm Posted by : CHAITHANYA GALAM NEWS

హిందుత్వం మతం కాదు.. భారతీయ జీవన విధానం

  • ఆత్కూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు వ్యాఖ్యలు
  • ‘కర్మవీరులారా కదిలి రండి’ గీతం ఆవిష్కరణ.. విద్యార్థులతో మాట–మంతి

ఉంగుటూరు(చైతన్యగళం): హిందుత్వం అనేది ఏ ఒక్క మతానికీ పరిమితమైన భావన కాదని, అది భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విలువలను ప్రతిబింబించే జీవన విధానమని మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో గురువారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా ‘కర్మవీరులారా కదిలి రండి’ గీతాన్ని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన ‘విద్యార్థులతో మాట–మంతి’ కార్యక్రమంలో పాల్గొని యువతతో మమేకమయ్యారు. విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిస్తూ, దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. విద్యతో పాటు విలువలు, క్రమశిక్షణ, దేశభక్తి, సామాజిక బాధ్యతను అలవర్చుకోవాలని సూచించారు.

భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని పేర్కొన్న వెంకయ్యనాయుడు.. అన్ని మతాలు, భాషలు, సంస్కృతులను సమానంగా గౌరవించే సంప్రదాయమే భారతీయతకు మూలమన్నారు. హిందుత్వం అంటే ద్వేషం కాదని, మానవత, సహనం, సేవాభావం, సమాజ శ్రేయస్సును ప్రతిబింబించే జీవన తత్వమని వివరించారు.

యువత భారతీయ సంస్కృతి, చరిత్ర, రాజ్యాంగ విలువలను అవగాహన చేసుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావడంలో యువశక్తి కీలక పాత్ర పోషించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్వర్ణభారత్ ట్రస్ట్ ప్రతినిధులు, విద్యార్థులు, అధ్యాపకులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.