CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 30 July 2026, 9:27 pm Posted by : rakeshkashaveni12@gmail.com

వరద సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్, జూలై 30(చైతన్యగళం):

గోదావరిఖని, పెద్దపల్లి, రామగుండం ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులపై ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. సహాయక, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

సచివాలయం నుంచి నిర్వహించిన ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, ఎన్‌టీపీసీ, తెలంగాణ జెన్‌కో, ఆర్‌ఎఫ్‌సీఎల్, రామగుండం పోలీసు కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట వెంకటరమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కూడా వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.

రామగుండం పారిశ్రామికవాడలో నిలిచిపోయిన వరద నీటిని వెంటనే తొలగించాలని, నాలాల్లో ఉన్న అడ్డంకులను తొలగించి నీటి ప్రవాహాన్ని సులభతరం చేయాలని మంత్రి ఆదేశించారు. సింగరేణి, ఎన్‌టీపీసీ సంస్థలు జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందించాలని సూచించారు. వీర్లపల్లి గ్రామంలోకి వరద నీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గంలో మళ్లించే చర్యలు చేపట్టాలని, గ్రామస్తులకు ఇందిరమ్మ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌కు సూచించారు.

గోదావరిఖని, రామగుండం ప్రాంతాల్లో మున్సిపల్, రెవెన్యూ శాఖలకు పోలీసులు పూర్తి సహకారం అందించాలని, ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చూడాలని, విపత్తు నిర్వహణ బృందాలను పూర్తిస్థాయిలో రంగంలోకి దించాలని ఆదేశించారు.

పెద్దపల్లి జిల్లాలోని 1,021 చెరువుల్లో సుమారు 80 శాతం నిండాయని, దీంతో 2.7 లక్షల ఎకరాలకు సాగునీటి కొరత ఉండదని మంత్రి తెలిపారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి నిల్వలు 20 టీఎంసీలకు చేరనున్న నేపథ్యంలో నీటి మట్టాలను నిరంతరం పర్యవేక్షించి ఒక్క చుక్క నీరూ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు అవసరమైన సహాయాన్ని అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వరద సహాయక చర్యలను సమర్థంగా పర్యవేక్షిస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.