న్యూఢిల్లీ, జూలై 30 (చైతన్యగళం): మధ్యప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్‌లో జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న పరికిపండ్ల నరహరి ని పద్మశాలి యువజన సంఘం వరంగల్ అధ్యక్షులు బేతి అశోక్ బాబు, 19వ డివిజన్ కాంటెస్ట్ కార్పొరేటర్ మంతెన అమరేష్ న్యూఢిల్లీలోని కర్తవ్య భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు.
వరంగల్ వాసులకు సుపరిచితులైన పరికిపండ్ల నరహరి పద్మశాలి సమాజానికి గర్వకారణంగా నిలిచారని వారు పేర్కొన్నారు. “హమారి లక్ష్మి లాడ్లీ యోజన” రూపకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన నరహరి , పుట్టిన గడ్డకు సేవ చేయాలనే సంకల్పంతో స్థాపించిన ఆలయ ఫౌండేషన్ ద్వారా విద్య, వైద్యం, ఉపాధి రంగాల్లో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.
వికలాంగులకు ఉచితంగా కృత్రిమ కాళ్లు అందించడం, ఉచిత వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు నిర్వహించడం, కోవిడ్ సమయంలో ఆక్సిజన్ కాన్సంట్రేటర్ల పంపిణీ వంటి అనేక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి అండగా నిలిచిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేశారు.సమావేశంలో వరంగల్ జిల్లాలో రాబోయే రోజుల్లో చేపట్టనున్న పలు సేవా కార్యక్రమాలపై విస్తృతంగా చర్చించారు. అలాగే, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీలకు అతీతంగా యువ నాయకులు ప్రజా సేవలో ముందుండాలని, నగర అభివృద్ధిలో యువత కీలక పాత్ర పోషించాలని పరికిపండ్ల నరహరి సూచించారు.