CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:52 pm Posted by : CHAITHANYA GALAM NEWS

వర్చువల్‌ సిమ్‌తో ‘తల్లికి వందనం’ నగదు మాయం!

  • ఓటీపీ చెప్పి మోసపోయిన లబ్ధిదారులు.. 36 వర్చువల్‌ సిమ్‌లతో నిందితుడి అరెస్టు
  • కోట్లలో లావాదేవీలు జరిగినట్లు పోలీసుల అనుమానం

కర్నూలు, జూలై 29(చైతన్యగళం):
‘తల్లికి వందనం’ పథకం లబ్ధిదారులే లక్ష్యంగా సైబర్‌ నేరగాళ్లు రెచ్చిపోయారు. వర్చువల్‌ సిమ్‌లను ఉపయోగించి లబ్ధిదారులకు ఫోన్‌ చేసి, పథకం నగదు ఖాతాలో జమైందంటూ నమ్మించి ఓటీపీలు సేకరించారు. అనంతరం బ్యాంకు ఖాతాల్లోని నగదును కాజేసిన ఘటన కర్నూలు జిల్లాలో వెలుగుచూసింది.

కర్నూలు నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదులతో రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో వర్చువల్‌ సిమ్‌ల ద్వారా సైబర్‌ మోసాలకు పాల్పడుతున్న ముఠా గుట్టును రట్టు చేశారు. కేసులో ప్రధాన నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతడి వద్ద నుంచి 36 వర్చువల్‌ సిమ్‌లు, మొబైల్‌ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కోట్లలో లావాదేవీలు?

ప్రాథమిక దర్యాప్తులో నిందితుల ద్వారా భారీ మొత్తంలో లావాదేవీలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ముఠా మరెంతమంది లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుంది? ఎంత మొత్తాన్ని కాజేసింది? మోసాలకు సహకరించిన మరికొందరు ఉన్నారా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. ఇతర నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

స్వాధీనం చేసుకున్న ఫోన్లు, సిమ్‌లలోని సమాచారాన్ని విశ్లేషిస్తున్న పోలీసులు మరిన్ని వివరాలను సేకరిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ సీఐ తెలిపారు.

ఓటీపీ చెబితే ఖాతా ఖాళీ!

ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. బ్యాంకులు, ప్రభుత్వ పథకాల పేరుతో అపరిచిత వ్యక్తులు ఫోన్‌ చేసినా ఓటీపీ, ఏటీఎం/డెబిట్‌ కార్డు వివరాలు, పిన్‌, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్‌కాల్స్‌, సందేశాలు వస్తే స్పందించకుండా వెంటనే సంబంధిత బ్యాంకు, సమీప పోలీస్‌స్టేషన్‌ లేదా సైబర్‌ క్రైమ్‌ విభాగాన్ని సంప్రదించాలని హెచ్చరించారు.

పథకం నగదు పేరుతో వచ్చే ప్రతి ఫోన్‌ కాల్‌ను నమ్మొద్దని.. ఓటీపీ చెప్పడం ద్వారా ఖాతాలోని నగదును సైబర్‌ నేరగాళ్లకు అప్పగించినట్లేనని పోలీసులు స్పష్టం చేశారు.