CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు

  • మహబూబాబాద్‌ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ప్రత్యేక పూజలు

మహబూబాబాద్(చైతన్యగళం): పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సాయిబాబా స్వామివారికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భజనలు, సాయినామస్మరణ కార్యక్రమాలు చేపట్టారు.

గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. భక్తుల సాయినామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. సుమారు 2,000 మంది భక్తులకు మధ్యాహ్నం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నప్రసాద కార్యక్రమానికి భక్తులు స్వచ్ఛందంగా అన్ని విధాలా సహకరిస్తున్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిర అధ్యక్షుడు వందనం కమల్‌కుమార్, కార్యదర్శి ఇమ్మడి చంద్రప్రకాష్, కోశాధికారి బొడ్ల రామకృష్ణ, సభ్యులు శివ కుమార్, ప్రదీప్, ఫణి కుమార్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మహబూబాబాద్ మున్సిపల్ కమిషనర్, ట్రైనీ జాయింట్ కలెక్టర్‌తో పాటు కార్యాలయ సిబ్బంది ఆలయాన్ని సందర్శించి సాయిబాబాను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు వారికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ బాధ్యులు మాట్లాడుతూ.. గురు పౌర్ణమి రోజున గురువును స్మరించుకోవడం, పూజించడం భారతీయ సంస్కృతిలో ఎంతో విశిష్టమైనదని తెలిపారు. సద్గురువు చూపిన మార్గంలో నడుస్తూ ప్రతి ఒక్కరూ సన్మార్గాన్ని అనుసరించాలని సూచించారు. సాయిబాబా బోధించిన ‘శ్రద్ధా.. సబూరి’ సిద్ధాంతాలను జీవితంలో ఆచరించాలని, భక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని కోరారు. సాయిబాబా ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.