CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 29 July 2026, 9:56 pm Posted by : CHAITHANYA GALAM NEWS

భగత్‌నగర్ సంచలన డెకాయిటీ కేసు ఛేదన – అల్లుడు, మనుమడే సూత్రధారులు

కరీంనగర్, జూలై 29 (చైతన్యగళం):
కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్‌లో ఇటీవల జరిగిన సంచలన ఇంటి డెకాయిటీ కేసును పోలీసులు అత్యంత చాకచక్యంగా ఛేదించారు. బాధితుడి సొంత అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజా ప్రధాన సూత్రధారులుగా గుర్తించబడగా, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.

నిందితుల వద్ద నుంచి రూ. 2.09 లక్షల నగదు, 43.67 గ్రాముల బంగారు ఆభరణాలు, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.

భగత్‌నగర్‌కు చెందిన ఎం.డి. అజ్మత్ అలీ నివాసంలో అర్ధరాత్రి సమయంలో దుండగులు డమ్మీ పిస్టళ్లు, కత్తులతో చొరబడి కుటుంబ సభ్యులను బెదిరించి, చేతులు కాళ్లు కట్టి నగదు, బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్లారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులు మీరట్‌కు చెందినవారని గుర్తించారు. ప్రత్యేక బృందాలు యూపీకి వెళ్లి స్థానిక పోలీసుల సహకారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారు సల్మాన్ @ భూరే @ యాదవ్ (22), సల్మాన్ @ విమాన్ (22), మొహమ్మద్ హసీన్ (19).

దర్యాప్తులో బాధితుడి అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజా ఈ డెకాయిటీకి ప్రధాన సూత్రధారులని బయటపడింది. కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల కారణంగా రజావుద్దీన్ ఈ దోపిడీకి పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రస్తుతం రజావుద్దీన్, అజీమ్ రజా పరారీలో ఉండగా, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.