పంట నుంచి మార్కెట్ వరకు ఆహార నాణ్యతపై నిఘా పెట్టాలి
డ్రైనేజీల పక్కన కూరగాయల విక్రయాలను అరికట్టాలి: పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ దండు
హైదరాబాద్, జూలై 29(చైతన్యగళం):
కాలికి వేసుకునే చెప్పులకు ఏసీ షోరూంలో భద్రత కల్పిస్తున్నాం.. కానీ కడుపులోకి వెళ్లే కూరగాయలు, ఆకుకూరలను మాత్రం డ్రైనేజీల పక్కన, ఫుట్‌పాత్‌లపై, అపరిశుభ్ర వాతావరణంలో విక్రయిస్తున్నారని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నరేష్ దండు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూరగాయల సాగు నుంచి మార్కెటింగ్ వరకు నాణ్యతా ప్రమాణాలను కఠినంగా అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా నరేష్ దండు మాట్లాడుతూ.. మనం ఉపయోగించే వస్తువుల పరిశుభ్రత, భద్రతపై చూపుతున్న శ్రద్ధ మనం తినే ఆహారంపై కూడా ఉండాలని అన్నారు. కూరగాయలు తాజాగా కనిపిస్తున్నాయా అనే దానికే పరిమితం కాకుండా అవి ఎక్కడ పండాయి, ఎలాంటి నీటితో సాగయ్యాయి, ఎంత మేర పురుగుమందులు వినియోగించారు, ఎలా రవాణా చేశారు, ఎక్కడ నిల్వ చేశారు అనే అంశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు.
మురుగు నీటితో సాగుపై నిఘా అవసరం
నగర పరిసరాల్లో కొన్ని ప్రాంతాల్లో మురుగు నీటిని వ్యవసాయానికి వినియోగిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయని నరేష్ దండు తెలిపారు. కలుషిత నీటితో సాగు చేసే పంటలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పురుగుల నివారణ పేరుతో పురుగుమందులను మితిమీరిన మోతాదులో వినియోగించడం, నిబంధనలకు విరుద్ధంగా రసాయనాలు వాడటం వంటి అంశాలపై క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని కోరారు.
కూరగాయలు, పండ్లు ఎక్కువకాలం తాజాగా కనిపించేందుకు అనుమతిలేని రసాయనాలు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపైనా అధికారులు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. అనుమానాస్పద ఉత్పత్తుల నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.
వానాకాలంలో మరింత అప్రమత్తత
వర్షాకాలంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్ల పరిశుభ్రత విషయంలో వినియోగదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని నరేష్ దండు సూచించారు. వర్షపు నీరు, మురుగు నీరు కలిసే ప్రాంతాల్లో విక్రయించే ఆహార పదార్థాలు మలినాలకు గురయ్యే అవకాశం ఉన్నందున రోడ్డు పక్కన, డ్రైనేజీల సమీపంలో విక్రయించే కూరగాయలను కొనుగోలు చేయకుండా ఉండాలని కోరారు.

‘నువ్వేమన్న డాక్టర్‌వా?’ అని నిర్లక్ష్యం వద్దు
కూరగాయలను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుభ్రమైన నీటితో బాగా కడగడం, ఆకుకూరలను విడదీసి మలినాలను తొలగించడం వంటి సాధారణ జాగ్రత్తలను ప్రతి ఒక్కరూ పాటించాలని నరేష్ దండు అన్నారు.
‘‘వ్యాధి వచ్చిన తర్వాత మందులు వేసుకోవడం కంటే.. వ్యాధి రాకముందే జాగ్రత్త పడటం మేలు. ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్తలు చెబితే ‘నువ్వేమన్న డాక్టర్‌వా?’ అంటూ కొట్టిపారేయకూడదు. ప్రజారోగ్య పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
పంట నుంచి ప్లేట్ వరకు పర్యవేక్షణ ఉండాలి
కూరగాయలు, పండ్ల నాణ్యతను కేవలం మార్కెట్‌లో తనిఖీ చేయడం సరిపోదని నరేష్ దండు అన్నారు. పంట సాగు, సాగునీరు, పురుగుమందుల వినియోగం, కోత, రవాణా, నిల్వ, మార్కెటింగ్ వరకు ప్రతి దశలో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షణ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
మురుగు నీటితో సాగు చేస్తున్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యామ్నాయ సురక్షిత నీటి వనరులను అందుబాటులోకి తీసుకురావాలని, రైతులు–వ్యాపారులు–వినియోగదారులకు ఆహార భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
ప్రజలూ బాధ్యతగా వ్యవహరించాలి
వినియోగదారులు కూడా తమ వంతు బాధ్యతగా పరిశుభ్రమైన ప్రాంతాల్లో విక్రయించే కూరగాయలకు ప్రాధాన్యం ఇవ్వాలని నరేష్ దండు కోరారు. ఇంటికి తెచ్చిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లను శుభ్రమైన నీటితో బాగా కడిగి వినియోగించాలని సూచించారు. వీలైనంత వరకు రైతుబజార్లు, నమ్మకమైన విక్రయ కేంద్రాలను ఆశ్రయించాలని తెలిపారు.
‘‘చెప్పులు మురికిగా అయితే కడుగుతాం.. పాడైతే మార్చేస్తాం. కానీ మన కడుపులోకి వెళ్లే ఆహారం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం? చెప్పులకు ఇచ్చే భద్రతలో కొంతైనా మన ఆహారానికి ఇవ్వాలి. లేకపోతే ఈరోజు డ్రైనేజీ పక్కన కొన్న కూరగాయలు.. రేపు ఆసుపత్రి గుమ్మం దగ్గర మనల్ని నిలబెట్టే ప్రమాదం ఉంది’’ అని నరేష్ దండు హెచ్చరించారు.
ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆహార పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.