CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 9:20 pm Posted by : CHAITHANYA GALAM NEWS

సైబర్ నేరగాళ్ల చేతిలో మున్సిపల్ అధికారి

ఆత్మకూరు, జూలై 28 (చైతన్యగళం):
నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో సైబర్ నేరగాళ్లు హల్‌చల్ చేసిన ఘటన కలకలం రేపుతోంది.

కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారిని లక్ష్యంగా చేసుకుని, ఏసీబీ డీఎస్పీ పేరుతో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి అవినీతి ఆరోపణలు ఉన్నాయని భయపెట్టాడు. ఈ వ్యవహారాన్ని బయటకు రాకుండా చూస్తానంటూ భారీ మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు.

నిజమైన కాల్ అని నమ్మిన అధికారి, సైబర్ నేరగాడు చెప్పిన నంబర్‌కు ఫోన్ పే ద్వారా రూ.95 వేల రూపాయలు పంపినట్లు సమాచారం. అనంతరం తాను మోసపోయానని గ్రహించి షాక్‌కు గురైన ఆయన, పరువు పోతుందన్న భయంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో గుట్టుచప్పుడు కాకుండా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

ఇదే తరహా బెదిరింపు కాల్స్ మున్సిపల్ కార్యాలయంలోని మరికొంతమంది సిబ్బందికి కూడా రావడంతో ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.

ఈ విషయంపై పోలీసులను వివరణ కోరగా, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అయితే, ఏసీబీ ఉన్నతాధికారుల ఆదేశాలతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు టౌన్ సీఐ మహేశ్వరుడు పేర్కొన్నారు.