CHAITHANYAGALAM
Newspaper Banner
Date of Publish : 28 July 2026, 11:10 am Posted by : CHAITHANYA GALAM NEWS

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించాలి

  • కల్తీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు
  • ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్

మహబూబాబాద్(చైతన్యగళం): రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించడంలో ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, విత్తన విక్రయదారులు బాధ్యతగా వ్యవహరించాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్ సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని, తాము పాలకులం కాదని, ప్రజా సేవకులమని ఆయన అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే మురళీ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భారతదేశ వ్యవసాయ రంగానికి రైతు వెన్నెముక లాంటివాడని, రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్‌రావు మాట్లాడుతూ… ఫెర్టిలైజర్స్, విత్తన దుకాణాల నిర్వాహకులు రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువుల వినియోగంపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని సూచించారు. సహజ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించేలా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. పంటల దిగుబడి పెరగాలంటే నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కల్తీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందుల విక్రయాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తోందని, అలాంటి వాటికి దూరంగా ఉండి రైతులకు నాణ్యమైన ఉత్పత్తులను మాత్రమే అందించాలని సూచించారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ నూతన కమిటీగా అధ్యక్షుడిగా వేమిశెట్టి సోమయ్య, కార్యదర్శిగా ఓలం రమేష్, కోశాధికారిగా నల్లపు వీరన్న, జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా చిదిరాల జ్ఞానేశ్వర్ ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే మహబూబాబాద్ మండల అధ్యక్షుడిగా ఒక్కల శ్రీనివాస్, కార్యదర్శిగా ఉపేందర్, కోశాధికారిగా ధూపాటి వినయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశారు.

నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో పదవులు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘం బలోపేతానికి, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, విత్తన విక్రయదారుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ జ్యోతి రమేష్, మదన్ గోపాల్, లోయ ప్రతాపని, పాండురంగయ్య, బోనగిరి లక్ష్మీనారాయణ, చిదిరాల జ్ఞానేశ్వర్, నేరుటి లక్ష్మీనారాయణ, వార్డు కౌన్సిలర్ రవి నాయక్, నాళ్ల లక్ష్మీ నరసింహారావుతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, విత్తన దుకాణాల నిర్వాహకులు, రైతులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.